విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
• ఈ నెల 31 వరకు గడువు..
• అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా విధాన పథకం 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెమిస్టర్కు సంబంధించి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి తెలిపారు. ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.5 లక్షలకు మించకూడదు. దరఖాస్తుదారులు కనీసం 35 శాతం మార్కులతో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే GREలో 260 మార్కులు లేదా GMATలో 500 మార్కులు సాధించాలి. TOEFLలో 60 మార్కులు లేదా IELTSలో 6.0 బ్యాండ్ స్కోరు లేదా PTEలో 50 మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు వివరాలు, ఇతర సమాచారానికి తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు.
https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.do