ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం
"39 మంది ప్రయాణికులు సురక్షితం.. పూర్తిగా దగ్ధమైన బస్సు"
బాలాపూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24) : గణేశ్ నిమజ్జనం, దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్న ప్రయాణికుల బస్సులో అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరే
గాయి. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగోలుకు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన సుమారు 150 మంది మూడు బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు. రాత్రి 2 గంటల సమయంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సుల్లో డీజిల్ పోస్తుండగా, ప్రధాన రహదారిపై నిలిపి ఉన్న TS 15 T 8558 నంబర్ గల శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో బస్సులోని 39 మంది సురక్షితంగా బయటపడ్డారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదు. కొద్దిసేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్ : బి.గణేష్