ఊపిరితిత్తులను నిర్లక్ష్యం చేయొద్దు!
దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం ఉంటే పరీక్షలు తప్పనిసరి
పొగాకు, కాలుష్యానికి దూరంగా ఉండాలి : డాక్టర్ కె.ఎస్. ఫణీంద్ర కుమార్
విశాఖపట్నం, సెప్టెంబర్ 24, మేజర్ న్యూస్: ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కె.ఎస్. ఫణీంద్ర కుమార్ సూచించారు. దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం, గురక, ఛాతిలో అసౌకర్యం, తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆస్తమా, సీఓపీడీ, న్యూమోనియా, క్షయ, ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజెస్, నిద్రలో శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స లేదా నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. సిగరెట్, బీడీతో పాటు అన్ని రకాల పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, ఇతరులు వదిలే పొగను కూడా పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాయు కాలుష్యం, దుమ్ము, రసాయనాల పొగకు ఎక్కువగా గురికాకుండా తగిన రక్షణ పరికరాలు వినియోగించాలని చెప్పారు. వయసు, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సూచన మేరకు అవసరమైన టీకాలు తీసుకోవాలన్నారు.
దగ్గు, ఆయాసానికి సొంతంగా మందులు వాడుతూ కాలం గడపకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ ఫణీంద్ర కుమార్ తెలిపారు. స్పైరోమెట్రీ, ఆక్సిజన్ శాచ్యురేషన్, అవసరాన్ని బట్టి ఇమేజింగ్ పరీక్షల ద్వారా ఊపిరితిత్తుల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చన్నారు. ఎక్కువకాలం పొగతాగిన వారు, దుమ్ము, రసాయనాలకు గురయ్యే వృత్తుల్లో ఉన్నవారు వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.