నిరుపేద విద్యార్థినికి బుట్టా ఫౌండేషన్ ఆర్థిక చేయూత
నిరుపేద విద్యార్థినికి బుట్టా ఫౌండేషన్ ఆర్థిక సహాయం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్ కాలనీకి చెందిన భీమేష్, గాయత్రి దంపతుల కుమార్తె బుగుడే భాగ్య ఉన్నత చదువులకు బుట్టా ఫౌండేషన్ గురువారం ఆర్థిక సహాయం అందించింది.
ప్రభుత్వ కోటాలో అశోక్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన భాగ్యకు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా హాస్టల్ ఫీజు చెల్లించడం కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ చొరవ తీసుకుని విద్యార్థినికి హాస్టల్ ఫీజు కోసం ఆర్థిక సహాయం అందించారు.
ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో బుట్టా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు అండగా నిలుస్తున్నామని వారు తెలిపారు.