అనపర్తిలో నేలకొరిగిన భారీ వృక్షం
అనపర్తిలో నేలకొరిగిన భారీ వృక్షం - ఇంటి షెడ్డు ధ్వంసం - తప్పిన ప్రాణనష్టం. వర్షంలో శ్రమించి రాకపోకలకు మార్గం సుగమం చేసిన అధికారులు.
తుపాన కారణంగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అనపర్తి మండల పరిధిలో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వరి పంట నీట మునిగాయి. ఈ క్రమంలో అనపర్తి నుంచి పెడపర్తి వెళ్లే ప్రధాన రహదారిలోని ఎర్రకాలువ వంతెన సమీపంలో గురువారం తెల్లవారుజామున భారీ వృక్షం ఒక్కసారిగా నేలకొరిగింది. చెట్టు రహదారిపై అడ్డంగా పడటంతో కొద్దిసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.భారీ వృక్షం రహదారికి అవతల ఉన్న ఓ భవనంపై పడటంతో ఇంటి షెడ్డు, తలుపులు తదితరాలు ధ్వంసమై ఆస్తి నష్టం సంభవించింది. అయితే సంఘటన తెల్లవారుజామున చోటుచేసుకోవడం, ఆ సమయంలో రహదారిపై రాకపోకలు తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.భారీ వృక్షం నేలకొరగడానికి చెట్టు ఉన్న స్థల యజమానులు వేర్ల వరకు తవ్వి ఉంచడమే ఈ వర్షాలకు భారీ వృక్షం కూలిపోవటానికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. చెట్టు వేర్ల చుట్టూ మట్టి తొలగించడంతో వృక్షం బలహీనపడి, భారీ వర్షాల సమయంలో నేలకొరిగిందని వారు పేర్కొన్నారు. తమ ఇంటిపై చెట్టు పడటంతో షెడ్డు, తలుపులు దెబ్బతిని గణనీయమైన నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్, పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే కూటమి నాయకులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భారీ వృక్షం రహదారిని పూర్తిగా ఆక్రమించడంతో తొలగింపు పనులు సవాలుగా మారాయి. అధికారులు, సిబ్బంది సుమారు ఎనిమిది గంటలపాటు శ్రమించి చెట్టు కొమ్మలు, దుంగలను తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేశారు. విద్యుత్ లైన్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సంబంధిత సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోగా, పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఫైర్ సిబ్బంది చెట్టును ముక్కలుగా తొలగిస్తూ రహదారిపై పేరుకుపోయిన అవరోధాలను తొలగించారు. అనంతరం రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు.సంఘటనపై స్పందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి సమస్యను పరిష్కరించడంపై స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మండలంలోని ప్రధాన రహదారులు, విద్యుత్ మార్గాల వెంట ప్రమాదకరంగా ఉన్న చెట్లను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భారీ వర్షాలు కారణంగా కరెంటు స్తంభాల కింద, పెద్ద చెట్ల క్రింద, పాత భవనల వద్ద ఎవరు ఉండవద్దని, వర్షాలు తగ్గింతవరకు దూర ప్రయాణాలు మానుకోవాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలకు తెలియజేశారు.