భూమిరెడ్డి ఈశ్వరమ్మ మరణించిన నేత్రదానంతో ఆమె కళ్ళు సజీవం
*భూమిరెడ్డి ఈశ్వరమ్మ మరణించిన నేత్రదానంతో ఆమె కళ్ళు సజీవం*
పులివెందుల మేజర్ న్యూస్,:
మరణానంతరం కూడా మరొకరికి వెలుగు పంచాలనే మహోన్నత సంకల్పంతో పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన భూమిరెడ్డి ఈశ్వరమ్మ (90 సంవత్సరాలు) కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. బుధవారం రాత్రి ఆమె వయోభారంతో మరణించగా, కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను దానం చేయాలని నిర్ణయించి మానవతా విలువలను చాటారు. మృతురాలి కుమారుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కుమార్తెలు ఉపాధ్యాయురాలు శైలశ్రీ, పద్మలీల, గీతేశ్వరి, కోడలు మాజీ సర్పంచ్ ఉమాదేవి, అల్లుళ్లు వెంకట కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, ఎరికల రెడ్డి, మనవళ్లు సాయి శ్రీనివాస్ రెడ్డి, మణికంఠ రెడ్డి, వెంకట జశ్వంత్ రెడ్డి, వెంకట అభినయ్ రెడ్డిలు నేత్రదానానికి అంగీకరిస్తూ స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు మొమ్మెల రాజుకు 9966509364 నంబర్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో, స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యంలో టెక్నీషియన్ అరవింద్ మృతురాలి నివాసానికి చేరుకుని పార్ధివ దేహం నుండి కార్నియాలను సేకరించారు. అనంతరం వాటిని హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి తరలించారు. ఈ కార్నియాల ద్వారా ఇద్దరు అంధులకు మళ్లీ చూపు ప్రసాదించే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు మొమ్మెల రాజు మాట్లాడుతూ, “మనిషి మరణించిన తర్వాత కూడా నేత్రదానం ద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. కంటి చూపు మరణంతో ఆగిపోకూడదు. ఒక వ్యక్తి నేత్రదానం ద్వారా మరో ఇద్దరు వ్యక్తులు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతారు. భూమిరెడ్డి ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి ఆదర్శప్రాయమైనది. ప్రజలు నేత్రదానంపై ఉన్న అపోహలను విడనాడి ముందుకు రావాలి. మరణానంతరం కూడా తమ అవయవాలు, నేత్రాలను దానం చేయడం ద్వారా అనేక మందికి కొత్త జీవితం అందించవచ్చు” అని అన్నారు. నేత్రదాన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహిత అమృత హస్తం సేవాసమితి ప్రతినిధులు పాల్గొని మృతురాలికి ఘన నివాళులు అర్పించారు. నేత్రదానానికి సహకరించిన కుటుంబ సభ్యులను సేవాసమితి తరఫున కృతజ్ఞత అభినందనలు తెలిపారు.