టాప్- 40 లో హైడ్రా బతుకమ్మ-అవార్డు అందుకున్న రాగం సాంబశివరావు
వెంకటాపురం నూగూరు, మేజర్ న్యూస్, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ లో వెంకటాపురం మండలానికి చెందిన యువ దర్శకుడు రాగం సాంబశివరావు రూపొందించిన 'హైడ్రా బతుకమ్మ' షార్ట్ ఫిల్మ్ సత్తా చాటింది.రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా చిత్రాలు పోటీపడగా,రెండు దశల ఎంపికను దాటి టాప్-40లో నిలిచి పార్టిసిపేషన్ అవార్డును దక్కించుకుంది.
హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన వేడుకల్లో ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల చేతుల మీదుగా సాంబశివరావు అవార్డును అందుకున్నారు. బతుకమ్మ పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. ఇందులో ములుగు జిల్లా మరికాల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విజయ్, ఆయన భార్య శ్రావణి,విద్యార్థులు నటించడం విశేషం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఇలాంటి సృజనాత్మక చిత్రాన్ని తీయడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని స్థానికులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్! చక్రిధర్, వెంకటాపూర్, ములుగు జిల్లా