సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ ఆంక్షలు
సిద్దిపేట,అర్బన్, :సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీస్ చట్టం ప్రకారం ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ నెల ౨౦వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి నవంబరు ౪వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
*ధర్నాలు* , *ర్యాలీలకు* *ముందస్తు* *అనుమతి* *తప్పనిసరి*
కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే సంబంధిత సహాయ పోలీస్ కమిషనర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఆయా కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. బంద్ల పేరుతో వివిధ కారణాలను చూపుతూ సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయాలని ఒత్తిడి చేయడం, బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలకు దిగితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*భారీ* *శబ్దాలతో* *డీజే* *వినియోగంపై* *నిషేధం*
చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థులకు శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారీ శబ్దాలతో కూడిన డీజే పరికరాల వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ నిషేధం కూడా అక్టోబరు ౨౦వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి నవంబరు ౪వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు.
మైకులు వినియోగించడం తప్పనిసరి అయిన సందర్భాల్లో సంబంధిత డివిజన్ సహాయ పోలీస్ కమిషనర్ అనుమతి పొందాలని సూచించారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
*నిబంధనలు* *ఉల్లంఘిస్తే* *కేసులు*
పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించే వారిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనలు, నగర పోలీసు చట్టం, పోలీసు చట్టంలోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని ఆమె కోరారు.