శ్రీ చిన్నజీయర్ స్వామీజీని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర శంకుస్థాపన, భూమిపూజ; స్వామీజీకి ఆహ్వానం
ఖమ్మం/హైదరాబాద్, సూర్య ప్రతినిధి: ఖమ్మం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్రానికి ఈ నెల 12వ తేదీన శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ శుభకార్యానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామీజీని ఆహ్వానించేందుకు ఆయన ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి వెళ్లారు.
ఆశ్రమంలో స్వామీజీని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి, ఆయనకు పాదాభివందనం చేసి దివ్యాశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ ఏర్పాట్లపై స్వామీజీతో చర్చించారు. ఈ నెల 12న జరిగే శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ ఆహ్వానం అందజేశారు. ఈ వేడుకలు పరమపూజ్య చిన్న జీయర్ స్వామీజీ అమృత హస్తాల మీదుగా అత్యంత వైభవంగా జరగనున్నాయని మంత్రి తెలిపారు.
ఖమ్మం నగరంలోని అల్లీపురంలో ఈ ఆలయాన్ని మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ భూమి విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. ఇంత విశాలమైన స్థలంలో ఆలయం రానుండటం ఖమ్మం ప్రజలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం లభించిందని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహకారంతో నిర్మాణ పనులను వేగంగా ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై, స్వామీజీ ఆశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.