శంషాబాద్ మధురానగర్లో కూల్చివేతలు.. అడ్డుకున్న స్థానికులు
శంషాబాద్ : శంషాబాద్ప పట్టణంలోని మధురానగర్లో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ఇళ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. అధికారుల చర్యలపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ కూల్చివేతలను అడ్డుకున్నారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుని ప్రజలకు అండగా నిలిచారు. స్థానికుల హక్కులను గౌరవిస్తూ, చట్టబద్ధమైన విధానాలను అనుసరించిన తర్వాతే ఎలాంటి చర్యలైనా చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్నామని చెబుతున్న తమపై ఇప్పుడు కూల్చివేతలు చేపట్టడం ఏమిటని స్థానికులు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ 118వ డివిజన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. శంషాబాద్లో అభివృద్ధికి తాము అడ్డంకి కాదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ హయాంలో అనుమతులు పొందడం తప్పా? అన్ని అనుమతులతోనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, ఇప్పుడు హుటాహుటిన కూల్చివేతలు చేపడితే తాము ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వారి ఇళ్లకు సంబంధించిన అనుమతులు, ఇతర పత్రాలను పరిశీలించి చట్ట ప్రకారం వ్యవహరించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. కూల్చివేతల విషయంలో అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, బాధితుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మధురానగర్లో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోతుల నర్సింహా, మేజర్ స్యూస్ - శంషాబాద్.