రోడ్డు కోసం ఎమ్మెల్యే పద్మావతికి వినతి పత్రం
మునగాల, మేజర్ న్యూస్: మండలంలోని నేలమర్రి నుండి మాధవరం వరకు రహదారి అధ్వానంగా మారిందని, తక్షణమే నిర్మాణం చేపట్టాలని కోరుతూ నేలమర్రి గ్రామానికి చెందిన రాజీవ్ మంగళవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
నేలమర్రి - మాధవరం రహదారి అనేక గ్రామాల ప్రజలకు నిత్య రాకపోకలకు ముఖ్యమైన మార్గమని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు.రైతులు పంట ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడానికి, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి, వైద్య అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత శాఖ ద్వారా సర్వే చేయించి నిధులు మంజూరు చేసి త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతి పత్రంలో కోరారు.