రక్తదానం ప్రాణదానంతో సమానం.. అనురాగ్ వర్సిటీలో 200 మంది రక్తదానం
ఘట్కేసర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): రక్తదానం ప్రాణదానంతో సమానమని అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. సి. మల్లేశ్ అన్నారు. వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 200 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎన్ఎస్ఎస్ యూనిట్లు 1, 2, 3, 5 సంయుక్తంగా జూబ్లీహిల్స్ విటల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించాయి.ఈ సందర్భంగా డా. సి. మల్లేశ్ మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడమే ఇలాంటి శిబిరాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డా. వి. విజయకుమార్ రక్తదాతలను అభినందించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. జె. రాజేంద్ర, డా. టి. పురుషోత్తం, పి. చిన్న శ్రీనివాస్రావు, శిక్షకులు టి. నవీన్, పి. వేణుగోపాల్, టి. విద్యాసాగర్, ఎన్సీసీ అధికారి ఫ్లయింగ్ ఆఫీసర్ సౌరభ్ బార్పుటే తదితరులు పాల్గొన్నారు.