పూల జాతరతో పటాన్ చెరు పులకింత.. అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ -సాకి చెరువు
పటాన్ చెరు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు పటాన్ చెరు లో అంబరాన్నంటాయి.పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడపడుచుల పండుగకు సాకి చెరువు కట్ట వేదికగా నిలిచింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన వేడుకలకు మహిళలు వేలాదిగా తరలివచ్చారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలతో సాకి చెరువు కట్ట పండుగ శోభను సంతరించుకుంది.సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సంబరాలు రాత్రి 11 గంటల వరకు ఆరు గంటలపాటు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మలను తీసుకొచ్చారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు లయబద్ధంగా ఆడిపాడుతూ పూల పండుగలో సందడి చేశారు. జానపద గాయకుల పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత కళను తీసుకొచ్చాయి.
ప్రకృతిని ఆరాధించే అపురూప పండుగ బతుకమ్మ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బతుకమ్మ వేడుకలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, ఆదరణతో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా పటాన్చెరు పట్టణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను జీవితాంతం మరువలేనని తెలిపారు. గత 15 ఏళ్లుగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తూ ప్రజల సంతోషాల్లో భాగస్వాములవుతున్నామని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
రచ్చ రవి బృందం ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణ
ప్రముఖ నటుడు, హాస్య కళాకారుడు రచ్చ రవి నేతృత్వంలోని బృందం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినోదభరిత కార్యక్రమాలతో కళాకారులు ప్రేక్షకులను అలరించారు. కాజిపల్లి భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పాటలు, జానపద సంగీత కార్యక్రమాలు మహిళలను మరింత ఉత్సాహపరిచాయి. పాటలకు అనుగుణంగా మహిళలు ఆడిపాడడంతో సాకి చెరువు కట్ట పరిసరాలు సందడిగా మారాయి.
విజేతలకు రూ.50 వేల నగదు బహుమతులు
సంప్రదాయబద్ధంగా, సృజనాత్మకంగా బతుకమ్మలను అలంకరించి తీసుకొచ్చిన మహిళలను ప్రోత్సహించేందుకు ఉత్తమ బతుకమ్మల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, పట్టు చీర, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, పట్టు చీర, తృతీయ బహుమతిగా రూ.10 వేలు, పట్టు చీర అందజేశారు. మరో 15 మంది మహిళలకు కన్సోలేషన్ బహుమతులతోపాటు పట్టు చీరలను ప్రదానం చేశారు. బహుమతులు అందుకున్న మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, ఆయన కుమార్తె, కోడలు, మనుమరాళ్లు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కుటుంబ సభ్యులు సంప్రదాయ వేడుకల్లో పాల్గొనడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. పూల పరిమళాలు, జానపద గీతాలు, మహిళల ఆటపాటలతో సాకి చెరువు కట్ట పండుగ వాతావరణాన్ని తలపించింది.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలు పటాన్ చెరు లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి.