పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి
• సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు త్వరలో మెడికల్ క్యాంపు
సూర్య, ఆదిలాబాద్ : పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ విధులను నిజాయితీగా నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొన్న ఆయన సిబ్బంది యూనిఫామ్‌ను పరిశీలించి, విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పోలీసులు సమర్థంగా విధులు నిర్వహించారని అభినందించారు. రానున్న ఉత్సవాల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వకుండా, యూనిఫామ్ గౌరవాన్ని పెంచేలా వ్యవహరించాలని సూచించారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడంతోపాటు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని, 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా యోగా నిర్వహించాలని తెలిపారు.
త్వరలో పోలీసు సిబ్బంది అందరికీ వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య బీమా సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. ఇతరులకు రుణాల విషయంలో షూరిటీ ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాలతోపాటు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోనూ పరేడ్ నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.