పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తాండూరులో సైకిల్ ర్యాలీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, ఐపీఎస్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తాండూరు డీఎస్పీ నర్సింహయ్య, డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంద్రాచౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది.విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, దేశ రక్షణలో వారు అందించిన సేవలను ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అదనపు ఎస్పీ తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు పోలీస్ శాఖ పట్ల గౌరవభావాన్ని కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.