ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు
అంతపురం కలెక్టరేట్ రిపోర్టర్.. వేణుగోపాల్..
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
అనంతపురం, అక్టోబర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ. ఆనంద్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పాటించాల్సిన చేయవలసినవి, చేయకూడనివాటిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలు చూపడం, కులమతాల పేరుతో ఓట్లు అడగడం, ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం నిషేధమని తెలిపారు. ప్రభుత్వ అధికారాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని, ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీ విజయాలను ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు.సభలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని, పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారం చేయడం, ఓటర్లను వాహనాల్లో తరలించడం, ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ చేయడం వంటి చర్యలకు పాల్పడరాదన్నారు.అలాగే ఇతర పార్టీల సభలకు ఆటంకం కలిగించకూడదని, వ్యక్తిగత ఆస్తులపై యజమాని అనుమతి లేకుండా ప్రచార సామగ్రి ఏర్పాటు చేయరాదని సూచించారు. ఎన్నికల ప్రచార ప్రకటనలకు వర్తించే నిబంధనల ప్రకారం ముందస్తు ధ్రువీకరణ పొందాలని తెలిపారు.ప్రశాంతమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని కలెక్టర్ ఓ. ఆనంద్ కోరారు.