ఇంకా అధికారం మత్తులోనే వైసీపీ -విర్రవీగితే ఊరుకునేది లేదు : కూటమి నేతల హెచ్చరిక
స్టాఫ్ రిపోర్టర్ తిరుపతి : తిరస్కరించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన వైసీపీ నాయకులు ఇంకా అధికార మత్తులోనే వ్యవహరిస్తూ దాడులు చేస్తూ విర్రవీగితే ఊరుకునేది లేదని తుడా ఛైర్మన్ డా.డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ హెచ్చరించారు. రాయచోటి పొంగునూరు తిరుపతిలో జరిగిన సంఘటనలపై శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వైసీపీపై మండిపడ్డారు.
ఓటమి భయంతోనే వైసిపి అల్లర్లు…
ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పుంగనూరులో వైసీపీ పాల్పడిన అరాచకాలే నిన్నటి ఘటనకు మూలకారణమన్నారు. ఓటమి భయంతో హింసాత్మక రాజకీయాలు చేస్తూ, ప్రతిపక్షంలో ఉంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం హేయమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఓటమి భయంతో ఎన్నికల వేళ హింసాత్మక రాజకీయాలు చేసిన వైసీపీ నాయకులు, నేటికీ అదే అరాచక వైఖరిని కొనసాగించాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. గత ఐదేళ్ల అరాచక పాలన ముగిసిపోయిందనే వాస్తవాన్ని వైసీపీ నాయకులు ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదు
ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం పూర్తిగా నిష్పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన కొనసాగుతుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలిపారు.
ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చి అధికారం నుంచి దించినప్పటికీ, ఎల్లకాలం తామే అధికారంలో ఉన్నామనే భ్రమల్లో వైసీపీ నేతలు బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం పోయినా అరాచక బుద్ధి పోలేదని, సమాజంలో అలజడులు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ దాడులు, దౌర్జన్యాలకు తెగబడటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసిపి తక్షణమే తమ పద్ధతిని మార్చుకోవాలి
ఈ సందర్భంగా కలికిరి మురళీ మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి దౌర్జన్యాలు, హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వైసీపీ నాయకులు తక్షణమే తమ పద్ధతి మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజా శాంతికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, దోషులను చట్టపరంగా శిక్షిస్తుందని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో టిడిపి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, అనిమినీమధు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్