telanagana
పారిశ్రామిక వాడకు రైతుల సహకారం.. ఎకరాకు రూ.28 లక్షల పరిహారం, 18 మందికి చెక్కులు పంపిణీ చేసిన ఆర్డీవో అనిత
దుద్యాల్, మేజర్ న్యూస్: ప్రాంత అభివృద్ధి, పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సహకరిస్తామని దుద్యాల్ మండలం ఈర్లపల్లి రెవెన్యూ పరిధిలోని రైతులు ముందుకు వచ్చారు. ఈర్లపల్లి, సెంటర్ కుంట్ర తండా, నాణ్య నాయక్ తండా పరిధిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు భూములు సేకరిస్తున్న నేపథ్యంలో, పరిహారం పొందేందుకు అంగీకరించిన 18 మంది రైతులకు గురువారం భూపరిహార చెక్కులు అందజేశారు. తాండూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అనిత రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎకరాకు రూ.28 లక్షల చొప్పున పరిహారం అందించారు.ప్రభుత్వం ఈ మూడు గ్రామాల పరిధిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు మొత్తం 359 ఎకరాల భూమిని సేకరించేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం అధికారులు నిర్వహించిన సర్వేలో 213 ఎకరాల అసైన్డ్ భూములు, 146 ఎకరాల పట్టా భూములను గుర్తించారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా పలువురు రైతులు ఇప్పటికే తమ అంగీకార పత్రాలను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ క్రమంలో తొలి విడతగా 18 మంది రైతులకు పరిహార చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తాము అడ్డంకిగా నిలవబోమని, పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.పరిహార చెక్కులు అందుకున్న రైతుల్లో వెంకట్ నాయక్, లోకేష్, నీలి బాబయ్య, శకుంతల, డాక్టర్ కృపావతి, డాక్టర్ పురుషోత్తం, మంజుల, నీలి రాములు, నీలి కిష్టప్ప, నీలి గున్నయ్య, రవి రాథోడ్, మోహన్, నానావత్ వెంకట్ నాయక్, చౌహన్ చక్రిబాయ్, నీలి రమేష్, నానావత్ రవి నాయక్, నీలి కిష్టయ్య తదితరులు ఉన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.