ఊరంతా ఒక్కటై.. ఒకే చెరువులో బతుకమ్మల నిమజ్జనం!
సిద్దిపేట రూరల్, : గ్రామంలో చెరువులు ఎన్ని ఉన్నా.. బతుకమ్మల నిమజ్జనం మాత్రం ఒకే చోట! తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామస్థులు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పలు చెరువులు, కుంటలు ఉన్నప్పటికీ మహిళలంతా ఒకే చోట ఉన్న వెంకటయ్య చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సందడి చేశారు. అనంతరం గ్రామమంతా ఒక్కటై వెంకటయ్య చెరువు వద్దకు చేరుకుని బతుకమ్మలను నిమజ్జనం చేశారు.గ్రామంలో ఇతర చెరువులు ఉన్నప్పటికీ, పూర్వీకుల కాలం నుంచి వెంకటయ్య చెరువులోనే బతుకమ్మలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం గ్రామస్థుల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల వారికున్న అభిమానానికి నిదర్శనంగా నిలుస్తోంది. మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పుల్లూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.