ములుగు, క్షీరసాగర్లో ఘనంగా మహిళా రైతుల దినోత్సవ వేడుకలు
ములుగు, : మహిళా రైతుల సేవలను గుర్తిస్తూ, వారి సాధికారతకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఆరోగ్యం, పోషకాహారం, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన ఉద్యాన పీజీ కళాశాల ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కార్యానుభవ కార్యక్రమ విద్యార్థుల భాగస్వామ్యంతో ములుగు, క్షీరసాగర్ గ్రామాల్లో మహిళా రైతుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.క్షీరసాగర్ గ్రామంలో విశ్వవిద్యాలయ అధికారి ఇన్ఛార్జి డా. విజయ మహిళా రైతుల వ్యవసాయ సేవలను ప్రశంసిస్తూ, సమతుల్య పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. విద్యార్థులు ఉద్యాన పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ, జీవ నియంత్రణ పద్ధతులు, వేప ఆధారిత ఉత్పత్తులు, జిగురు అట్టలు, లైంగిక ఆకర్షణ ఉచ్చుల వినియోగంపై మహిళా రైతులకు అవగాహన కల్పించారు. రసాయనిక పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.ములుగు గ్రామంలో విద్యార్థులు మహిళా రైతుల వ్యవసాయ శ్రమ, కుటుంబ పోషణలో వారి పాత్రను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డా. వి. సుచిత్ర మాట్లాడుతూ, ప్రధానమంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న విజయవంతమైన గ్రామీణ మహిళల జీవిత విశేషాలను వివరించి, వారిని ఆదర్శంగా తీసుకోవాలని మహిళా రైతులకు సూచించారు. నేటి ఆధునిక కాలంలో మహిళా రైతులు డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలు, ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించుకోవాలని, పంటల ఎంపిక, సాగు ప్రణాళిక, ఉత్పత్తుల విక్రయాల్లో నిర్ణయాధికారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో మహిళా రైతులను శాలువాలతో సత్కరించి, పోషకాహారం ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు అరటిపండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయ కార్యానుభవ కార్యక్రమ సమన్వయకర్తలు సింధుజ, శరణ్య, రాణి, బోధనా సహాయకులు, శ్రీశైలం, రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధి పాల్గొన్నారు. క్షీరసాగర్ గ్రామంలో సర్పంచ్ బాలరెడ్డి, మమత, ఉపసర్పంచ్ నల్ల పర్శరాం, వార్డు సభ్యులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.