మేడ్చల్‌లో సంచలనం సృష్టించిన గౌరీ లిక్కర్ మార్ట్ చోరీ.. రేకులు తొలగించి నగదు, మద్యం ఎత్తుకెళ్లిన దొంగలు
మేడ్చల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి నంబర్ 44ను ఆనుకుని ఉన్న ప్రముఖ గౌరీ లిక్కర్ మార్ట్‌లో జరిగిన భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాత్రి సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన దుండగులు, వైన్ షాపును టార్గెట్ చేసుకుని తమ చేతివాటం ప్రదర్శించారు. దుకాణం వెనుక వైపు ఉన్న రేకులను కత్తిరించి లోపలికి ప్రవేశించినట్లుగా ప్రాథమిక విచారణలో స్పష్టత వచ్చింది. షాపు భద్రతను ఛేదించుకుని మరీ లోపలికి వెళ్లిన దొంగలు, అక్కడ సురక్షితంగా ఉన్న కొంత నగదుతో పాటు ఖరీదైన కొన్ని మద్యం బాటిళ్లను కూడా ఎత్తుకెళ్లినట్లు సమాచారం అందింది.తెల్లవారిన తర్వాత యథావిధిగా దుకాణాన్ని తెరిచేందుకు సిబ్బంది ఉదయం వేళ షాపు దగ్గరకు చేరుకోగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. షాపు వెనుక రేకులు కోసి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, లోపల గందరగోళంగా పడి ఉన్న వస్తువులను చూసి కంగుతిన్నారు. వెంటనే తేరుకుని యజమానికి సమాచారం అందించడంతో పాటు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణంలో చోటుచేసుకున్న నష్టం అంచనాతో పాటు దొంగలు సంచరించిన తీరును పరిశీలించి వేలిముద్రల నిపుణుల సహాయంతో కీలక ఆధారాలు సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. దుకాణం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వివిధ వ్యాపార సముదాయాలు, సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున ఆ మార్గంలో సంచరించిన అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. రద్దీగా ఉండే జాతీయ రహదారి ప్రాంతంలో ఇలాంటి చోరీ జరగడం స్థానిక వ్యాపారులలో ఆందోళన కలిగిస్తుండగా, పోలీసులు మాత్రం త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రిపోర్టర్ తలారి శివకుమార్.