సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి... సర్ ప్రక్రియను నిలిపివేసి...తొలగించిన అర్హుల ఓట్లను పునరుద్ధరించాలి:సిపిఐజిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి...
సర్ ప్రక్రియను నిలిపివేసి...తొలగించిన అర్హుల ఓట్లను పునరుద్ధరించాలి:సిపిఐజిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
అక్టోబర్ 1న వామపక్షాల ఆధ్వర్యంలో నల్లగొండ లో నిరసన.
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...: ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, అర్హులైన పౌరుల ఓట్లను పునరుద్ధరించాలని సిపిఐజిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డిలు డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియను నిలిపివేయాలని, తొలగించబడిన అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 1న నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో వామపక్ష,ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బుధవారం నల్లగొండలోని సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దుమ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని,దానిని ఏ కారణంతోనూ అన్యాయంగా హరించరాదని నాయకులు అన్నారు. సర్ పేరుతో ఓటర్ల జాబితాల సవరణ చేపడుతూ అర్హులైన పౌరుల పేర్లు తొలగించే పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపించారు.ఎన్నికల సంఘం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని వారు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్,కేరళ రాష్ట్రంలో ఓట్లను తొలగించి బిజెపి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన నివేదికలను వారు ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలు ఎన్నికల సంఘం నిర్ణయ ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.తెలంగాణలో సర్ ప్రక్రియలో భాగంగా వివిధ కారణాలతో భారీ సంఖ్యలో ఓటర్ల వివరాలు పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు.
నల్లగొండ జిల్లాలోనూ సుమారు 2లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ చేపడుతున్నారని, తమకు అందిన సమాచారం ప్రకారం సుమారు 45 వేల మందికి నోటీసులు అందినట్లు వారు తెలిపారు. మిగిలిన వారికి నోటీసులు అందకపోవడం, విచారణ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, సిపిఐ (ఎం) జిల్లా నాయకులు హషం, పుచ్చాకాయల నర్సిరెడ్డి,తదితరులు ఉన్నారు.