హైకోర్టుకు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
హైదరాబాద్, సూర్య ప్రతినిధి :ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఉప ఎన్నిక నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం (EC) తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఖైరతాబాద్ ఎన్నికల ఫలితాలు మరియు ఎమ్మెల్యే ఆస్తుల వివరాలకు సంబంధించి దాఖలైన ఎలక్షన్ పిటిషన్ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నందున ఉప ఎన్నిక నిర్వహణ సాధ్యపడదని ఈసీ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు పి. విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈసీ ఈ కీలక ప్రకటన చేసింది. గత ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థి అఫిడవిట్‌పై వివాదం నడుస్తున్నందున, న్యాయస్థానంలో తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసే ఉద్దేశం లేదని వెల్లడించడంతో ఈ అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.