ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాల ఆవరణలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి పరిస్థితిని పరిశీలించిన అనంతరం అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడి వద్ద లభించిన వివరాలు, దుస్తులు తదితర ఆధారాల ద్వారా అతడి గుర్తింపును నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు ఏమిటన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ఈ ఘటనపై ఎస్సై వెంకట్ రెడ్డిని వివరణ కోరగా, మృతుడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. సంఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు లేదా బంధువుల వివరాలు లభించిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.