మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ - రిమాండ్కు తరలింపు
- బాధిత మహిళను రక్షించిన ఉమర్కు సన్మానం చేసిన ఎస్ఐ వరప్రసాద్.
కొందుర్గ్ : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కొందుర్గ్ ఎస్సై వరప్రసాద్ శనివారం తెలిపారు. ఎస్సై కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొందుర్గ్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాధిత మహిళ (49) తన గ్రామానికి వెళ్లేందుకు కొందుర్గ్ బస్టాండ్లో శుక్రవారం రాత్రి వేచి ఉండగా, నిందితుడు ఆమెకు లిఫ్ట్ ఇస్తానని, ఆమె గ్రామంలో దింపుతానని నమ్మించి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడానీ, అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందుర్గ్ మండల కేంద్రంలో మొబైల్ షాప్ నిర్వహించే ఉమర్ ఈ విషయాన్ని గమనించి నిందితుడిని ప్రశ్నించగా, అతను తన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయాడానీ, వెంటనే ఉమర్ బాధిత మహిళకు సహాయం చేసి, ఆమెను కొందుర్గ్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి ఫిర్యాదు చేయించాడని ఎస్సై తెలిపారు. ఉమర్ సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను అభినందిస్తూ, బాధిత మహిళకు సహాయం చేసినందుకు కొందుర్గ్ ఎస్ఐ వరప్రసాద్ శనివారం పోలీసు స్టేషన్ లో శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వరప్రసాద్ మాట్లాడుతూ, మహిళల పట్ల అసభ్యంగా లేదా దురుసుగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు, రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించి బాధితులను రక్షించేందుకు ముందుకు రావాలని సూచించారు. నేరాలు జరగకుండా అడ్డుకోవడంలో, ప్రమాద సమయాల్లో బాధితులను రక్షించడంలో సమయస్ఫూర్తితో వ్యవహరించే పౌరులను పోలీస్ శాఖ తరఫున తగిన విధంగా అభినందించి సత్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్.