కిరాణా దుకాణానికి వెళ్తానని వెళ్లి.. బాలుడు అదృశ్యం
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 3):
కిరాణా దుకాణానికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లిన 15 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా బరుయిన్ గ్రామానికి చెందిన భరత్ రామ్ (52) కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం సుమారు 15 రోజుల క్రితం ఎదులాబాద్‌లోని ఉమామహేశ్వర మిల్ బోర్డ్ కంపెనీకి వచ్చి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 2న సాయంత్రం 4 గంటల సమయంలో కంపెనీలో పని జరుగుతుండగా భరత్ రామ్ పెద్ద కుమారుడు ఆకాష్ కుమార్ (15) కిరాణా దుకాణానికి వెళ్తున్నానని తోటి కార్మికుడు రాహుల్‌కు చెప్పి బయటకు వెళ్లాడు.చాలాసేపైనా బాలుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ఘట్‌కేసర్ పోలీసులను ఆశ్రయించారు. బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేదని తండ్రి పోలీసులకు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.
రిపోర్టర్ గుర్రం రమేష్.