కేటీఆర్ గోదావరిఖని పర్యటన సినిమా ప్రమోషన్ కోసమే: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
తెలంగాణ బ్యూరో ప్రతినిధి: సింగరేణి కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను తమ ప్రభుత్వం చేస్తోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. సింగరేణి కార్మికులకు ఇళ్లు నిర్మించడంతో పాటు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ గోదావరిఖని పర్యటన సినిమా ప్రమోషన్ కోసమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుకరిస్తూ గడ్డం, మీసాలు పెంచుకోవడం ద్వారా ప్రజలను నమ్మించలేరన్నారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిని నాలుగు భాగాలుగా చేసి కల్వకుంట్ల కుటుంబం బొగ్గు, బూడిద, మట్టిని దోచుకుందని ఆరోపించారు. సింగరేణి సమస్యలకు గత ప్రభుత్వమే కారణమని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎల్నినో ప్రభావానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాధ్యుడిగా పేర్కొనడం హాస్యాస్పదమని వీరేశం అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకు ముడిపెట్టవద్దని సూచించారు. గతంలోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను వాటికి బాధ్యుడిగా కాంగ్రెస్ నిందించలేదని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో రైతులకు ధైర్యం చెప్పాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు కేటీఆర్ సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణను త్వరగా పూర్తి చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను వేగవంతం చేయాలని కోరాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించడమే కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని వీరేశం ఆరోపించారు.