ఇందిరమ్మ ఇల్లు కోసం లబ్ధిదారుల నిరీక్షణ!
సూర్య రాజంపేట :
ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన లేకపోవడం, రికార్డుల నిర్వహణలో చోటుచేసుకుంటున్న తప్పిదాలు అసలైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లు నిరీక్షణగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు కు అర్హత ఉన్నప్పటికీ అధికారిక రికార్డుల్లో తప్పుగా నమోదైన వివరాల కారణంగా ప్రభుత్వ పథకానికి లబ్ధిదారులు దూరమవుతున్నారు. ఉండడానికి సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆశతో ఎదురు చూస్తున్న కుటుంబాలకి, గతంలో నిర్వహించిన సర్వేలో జరిగిన తప్పిదలు ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అడ్డంకిగా మారుతున్నాయి.
గతంలో జరిగిన తప్పిదాలను అధికారులు సవరించి కనుకరిస్తారేమో అని ఎదురుచూపులు చూసిన పరిష్కార మార్గం మాత్రం చూపడం లేదు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా రాజంపేట గ్రామానికి చెందిన మోచే చంద్రకళ భర్త మోచే గంగాధర్ ఇందిరమ్మ ఇల్లు కోసం ఎన్నో రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. అయితే గతంలో నిర్వహించిన సర్వేలో నమోదైన వివరాల కారణంగా ప్రస్తుతం తాము ప్రభుత్వ పథకానికి అనర్హులుగా చూపుతున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో మోచే గంగాధర్ ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆ సమయంలో నిర్వహించిన సర్వేలో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆయన ఫొటోను క్యాప్చర్ చేసి, L3లో ఇంటి యజమానిగా నమోదు చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఆ నమోదు వివరాలే తమకు సమస్యగా మారాయని వాపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకున్న సమయంలో రికార్డుల్లో తమ పేరు L3లో ఇంటి యజమానిగా నమోదై ఉందని, అందువల్ల తాము అనర్హులమని అధికారులు చెప్పినట్లు బాధితులు పేర్కొన్నారు.తమకు ఆ ఇంటి పై ఎలాంటి హక్కు లేదని, తాము కేవలం అద్దెకు మాత్రమే ఉన్నామని అధికారులకు వివరించినప్పటికీ ఎంతకి సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో బాధితురాలు ప్రజావాణిని ఆశ్రయించారు. ఒక్కసారి కాదు.. ఏకంగా మూడు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని ఆమె వాపోయారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుందని ఆశించినా, రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని,సంబంధిత అధికారులు తన సమస్యను పూర్తిగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
సమస్య పరిష్కారం కోసం బాధిత కుటుంబం సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న పత్రాలు, ఆధారాలు చూపిస్తూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం కనిపించడం లేదని,ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పంపుతూ కాలయాపన చేస్తున్నారని, అసలు సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కరించాల్సిన అధికారులు బాధ్యత తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
అధికారుల రికార్డుల్లో జరిగిన తప్పిదానికి మేమెందుకు బాధ్యత వహించాలి? మాకు సొంత ఇల్లు లేకపోయినా రికార్డుల్లో ఇల్లు ఉన్నట్లు చూపించి ప్రభుత్వ పథకానికి దూరం చేయడం ఎంతవరకు న్యాయం?” అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో రికార్డులే కీలకం. లబ్ధిదారుల అర్హతను నిర్ధారించే సమయంలో గతంలో నమోదైన వివరాలను అధికారులు పరిశీలిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, రికార్డుల్లో ఉన్న వివరాలు సరిపోలకపోతే అసలైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది.
ఈ ఘటనలోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని బాధిత కుటుంబం చెబుతోంది. గతంలో అద్దెకు ఉన్న ఇంటి వివరాలు ప్రస్తుతం తమకు సొంత ఇంటిగా చూపడం వల్ల ఇందిరమ్మ ఇల్లు పథకానికి దూరమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తమకు సొంత ఇల్లు లేదని, గతంలో అద్దె ఇంట్లో నివసించిన సమయంలో జరిగిన నమోదు తప్పిదం వల్లే ప్రస్తుతం సమస్య ఏర్పడిందని బాధిత కుటుంబం పేర్కొంటోంది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, పాత రికార్డులను పరిశీలించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని కోరుతున్నారు.
అధికారుల తప్పిదం కారణంగా అర్హత ఉన్న కుటుంబం ప్రభుత్వ పథకానికి దూరం కాకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడం పట్ల వారు ప్రశ్నిస్తున్నారు.ఇల్లు లేని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు పథకం ఒక ఆసరా, కానీ రికార్డుల్లోని తప్పిదం ఆ ఆసరాకు అడ్డంకిగా మారకూడదని బాధిత కుటుంబం కోరుకుంటుంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి, రికార్డుల్లో ఉన్న తప్పును సరిచేసి, అర్హత ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.