ఐదేళ్లలో ఎన్నో సాధించాం.. ప్రజా సేవలో అంకితభావంతో పని చేశాం
*జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర
*పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవలోనే ఉంటామని ఉద్ఘాటన
*భావోద్వేగాల నడుమ సాగిన ఆఖరి సర్వసభ్య సమావేశం
*హాజరైన ఎంపీ గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ
విశాఖపట్నం, సెప్టెంబర్ 22: విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో సంతృప్తిని, మధురమైన అనుభూతిని కలిగించిందని జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. ఈ ఐదేళ్లలో సమష్టిగా కలిసి ప్రజా సేవలో అంకితభావంతో పని చేశామన్నారు. 2021 సెప్టెంబర్ 24న తనతో పాటు జడ్పీటీసీ సభ్యులు, వైస్ చైర్మన్లు ఎన్నికై, ఐదేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చరిత్ర కలిగిన విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో జడ్పీటీసీ సభ్యులు, వైస్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మూడు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సభను నిర్వహించుకోవడం ఒక మంచి ఆనవాయితీగా కొనసాగిందని గుర్తు చేశారు. ఈ సమావేశం మన చివరిది కావడం కొంత బాధగా ఉన్నప్పటికీ, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల విభజన జరగడం సహజమైన ప్రక్రియ అని అన్నారు. జిల్లాలు విడిపోయినా ప్రజాసేవ విషయంలో మనమంతా కలిసే ఉంటామని సుభద్ర స్పష్టం చేశారు.
జిల్లా పరిషత్ వేదికగా గ్రామ స్థాయి నుంచి వచ్చిన అనేక సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం తదితర అంశాలపై జిల్లా పరిషత్ సమావేశాల్లో సమగ్రంగా చర్చించామని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడిందన్నారు. ఇక్కడ ప్రస్తావించిన సమస్యలు, అంశాలు చట్టసభల్లో కూడా చర్చకు వచ్చాయని, చాలా వాటికి పరిష్కారం లభించిందని పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవలో నిరంతరం కొనసాగుతామని సుభద్ర అన్నారు. ఐదేళ్ల పదవీకాలంలో తనకు సహకరించిన జడ్పీటీసీ సభ్యులు, వైస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులందరికీ ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
*గౌరవ వేతనం ఇవ్వాలి.. వైద్య సేవలను మెరుగు పరచాలి*
జడ్పీ సమావేశ మందిరం వేదికగా మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు ప్రజా సమస్యలపై వాణి వినిపించారు. ముఖ్యంగా వైద్యపరమైన సేవలను విస్తృతం చేయాలని, ప్రధాన మండల కేంద్రాల పరిధిలో అంబులెన్స్ లు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎజెన్సీ ప్రాంత నుంచి మైదాన ప్రాంత వరకు అంబులెన్స్ సేవలను విస్తరించాలని కోరారు. అరకు, ఎస్.కోట వంటి గిరిజనులు ఉండే ప్రాంతాల్లోని రోగులను కేజీహెచ్ కు రిఫరల్ చేయాలని, విజయనగరం వద్దని కొందరు సభ్యులు విన్నవించారు. ఇదే క్రమంలో కొత్తగా అందించనున్న ఫింఛన్ల మంజూరు విషయంలో, సదరం సర్టిఫికేట్ల జారీలో అందరికీ సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంటరి మహిళలకు అందించే పింఛన్ల విషయంలో నిబంధనలు సడలించాలన్నారు. సభ్యులందరికీ గౌరవ వేతనం పెండింగ్ ఉందని, జడ్పీ జనరల్ ఫండ్ నుంచైనా వాటిని మంజూరు చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేయగా.. జడ్పీ ఛైర్పర్శన్ సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉండగా సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సూచించారు.
*పంచాయతీరాజ్ వ్యవస్థే రాజకీయ ప్రస్థానానికి పునాది ః గొల్ల బాబూరావు*
పంచాయతీరాజ్ వ్యవస్థ రాజకీయ ప్రస్థానానికి పునాది వంటిదని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలంటే పంచాయతీరాజ్ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధుల రాజకీయ ప్రస్థానానికి ఇది పునాది కాగా, మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరేలా రాజ్యాంగ నిర్మాతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని రూపొందించాయని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులకు అధికారంతో పాటు ప్రజల పట్ల జవాబుదారీతనం ఉంటుందన్నారు. తన రాజకీయ ప్రస్థానానికి జిల్లా పరిషత్ పునాది అని గొల్ల బాబూరావు గుర్తు చేశారు. ఇక్కడ పనిచేసిన అనుభవం వల్లే ప్రజాజీవితంలో ఎదిగే అవకాశం లభించిందన్నారు. విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం కేవలం నాలుగు మండలాలే ఉండటం కొంత బాధాకరంగా ఉందన్నారు. జిల్లా పరిషత్ విస్తృత పరిధిలో ఉండి కనీసం 15 నుంచి 20 మండలాలు ఉంటే ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. “సర్వీస్ టు హ్యూమన్ బీయింగ్ ఈజ్ సర్వీస్ టు గాడ్” అని బాబూరావు పేర్కొన్నారు. సభ్యుల ప్రస్తుత పదవీకాలాన్ని కేవలం ముగింపుగా చూడకూడదని, ఇది భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగడానికి పునాది వంటిదని అన్నారు.
*ప్రజల విశ్వాసమే అసలైన గుర్తింపు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి*
ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమే ప్రజాప్రతినిధుల అసలైన విజయమని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. జిల్లా పరిషత్ ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చైర్‌పర్సన్, సభ్యులు అందించిన సేవలను అభినందించారు. జిల్లా పరిషత్ అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వేదిక అని పేర్కొన్న ఆమె.. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు తదితర ప్రజా సమస్యలను ప్రతి సమావేశంలో సభ్యులు ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేశారన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులందరూ బాధ్యతాయుతంగా పనిచేశారని కొనియాడారు. “పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రజల కోసం చేసిన సేవ, చేపట్టిన అభివృద్ధి, ప్రజల మనసుల్లో సంపాదించుకున్న గౌరవం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి” అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
*జిల్లా పరిషత్‌తో మా కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం ః బండారు*
జిల్లా పరిషత్‌తో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు. మండల ప్రెసిడెంట్‌గా ఇదే భవనంలోకి అడుగుపెట్టానని, అనంతరం ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇదే భవనంతో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు. అయితే ఇది వీడ్కోలు కార్యక్రమం కాదని, చైర్‌పర్సన్, సభ్యులను సన్మానించేందుకు తాను ప్రత్యేకంగా హాజరయ్యానని చెప్పారు. చైర్‌పర్సన్ నాయకత్వంలో సమస్యలను పార్టీలకు అతీతంగా చర్చించి పరిష్కరించుకోగలిగామని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సమగ్రంగా చర్చిస్తూ ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా సభను నిర్వహించారని అభినందించారు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి ఎదుగుతారో ఎవరూ చెప్పలేరని, జిల్లా పరిషత్ మాజీ సీఈవోగా పనిచేసిన గొల్ల బాబూరావు అనంతరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే లెక్చరర్‌గా, న్యాయవాదిగా పనిచేసిన జి.ఎం.సి. బాలయోగి జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, అనంతరం మంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా ఎదిగారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు తమ జీవితాన్ని ఎప్పుడూ ఒక తెల్ల కాగితంలా నిష్కళంకంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజల్లో విశ్వసనీయత ఉంటే భవిష్యత్తులో ప్రజలే తగిన గుర్తింపును ఇస్తారని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాప్రతినిధులకు క్షేత్రస్థాయి అనుభవాన్ని అందించే గొప్ప వేదిక అని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారానే తమ కుటుంబానికి గుర్తింపు లభించిందని, తన తండ్రి, తాను కూడా ఈ వ్యవస్థ నుంచే ఎదిగామని బండారు గుర్తు చేసుకున్నారు.
*మూడు జిల్లాలకూ జిల్లా పరిషత్ ఆస్తుల్లో సమన్యాయం*
జిల్లా పరిషత్ విభజన అనంతరం విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సమన్యాయం జరిగేలా కార్యక్రమాలు రూపొందించాలని చైర్‌పర్సన్, సీఈవోలను ఎమ్మెల్యే కోరారు. ఏజెన్సీ ప్రాంతాలు, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌లను వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ఆస్తులైన భవనాలు, గెస్ట్‌హౌస్‌లు మూడు జిల్లాలకు చెందినవేనని పేర్కొన్నారు. ఆస్తులను భవిష్యత్తులో పంపిణీ చేసే సమయంలో జనాభా ప్రాతిపదికన, ఉద్యోగుల కేటాయింపు తరహాలో మూడు జిల్లాలకు న్యాయమైన వాటా కల్పించాలని కోరారు.
*భావోద్వేగాల నడుమ సాగిన సత్కార కార్యక్రమాలు*
అనంతరం జెడ్పీ ఛైర్పర్శన్ ను ఎంపీ గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే బండారు సత్యానారయణ, ఇతర సభ్యులు దుశ్సాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులకు, పలువురు ఎంపీపీలకు అతిథుల చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ క్రమంలో సభ్యులు భావోద్వేగంతో కూడిన ప్రసంగాలు చేశారు. అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. కొప్పుల వెలమ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్, ఉమ్మడి జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.