జూరాల నీటిపై బీఆర్‌ఎస్ రాజకీయ హడావుడి : మంత్రులు
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు, రైతుల పంటలకు నీటి విడుదల అంశంపై బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ హడావుడి చేస్తున్నారని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రైతులకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జూరాల నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిపై బీఆర్‌ఎస్ నాయకులకు స్పష్టత లేదని వాకిటి శ్రీహరి అన్నారు. గతంలోనూ జూరాల నీటిని తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉంచారని, అప్పట్లో తాము రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. రైతులు సమన్వయం పాటించాలని కోరామని, తన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులు వక్రీకరించారని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రులు విమర్శలు చేశారు. 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీష్‌రావు అంగీకరించారని వారు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణకు 69 శాతం వాటా కోసం న్యాయపోరాటం చేస్తోందని తెలిపారు.
జూరాలలో 2.5 టీఎంసీల సిల్ట్ ఉందని, మరో 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీలో ఉన్నాయని జూపల్లి కృష్ణారావు చెప్పారు. మరో 2.5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటాయించాల్సి ఉందని, సుమారు ఒక టీఎంసీ ఆవిరి రూపంలో నష్టపోతుందని వివరించారు. కర్ణాటక నుంచి జూరాలకు నీరు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 20న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశామని జూపల్లి తెలిపారు. రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల పాటు నీరు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ముందుగానే రైతులను అప్రమత్తం చేసి ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించామని, అయినప్పటికీ వరి సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పాలమూరు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.