మండల పరిషత్తు పాలకవర్గానికి నేటితో ముగింపు
బాడంగిలో తొలిసారి వైకాపా కి దక్కిన ఎంపీపీ పీఠం
లాటరీలో వైకాపా ఎంపీపీగా భోగి గౌరీ.. అవిశ్వాసంతో పదవీచ్యుతి
అనంతరం టీడీపీ ఎంపీపీగా యజ్జల లక్ష్మి.. గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన
బాడంగి, సెప్టెంబరు 22 (మేజర్ న్యూస్):
బాడంగి మండల పరిషత్తు పాలకవర్గం పదవీకాలం నేటితో ముగియనుంది. మండల పరిషత్ పాలకవర్గంలో భాగమైన ఎంపీటీసీల పదవీకాలం బుధవారంతో పూర్తికానుండటంతో గురువారం నుంచి మండల పరిషత్ పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆయా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. తాజాగా మండల పరిషత్‌కు కూడా అదే పరిస్థితి ఏర్పడనుంది.
బాడంగి మండల పరిషత్ రాజకీయ చరిత్రలో ఈ పాలకవర్గం పలు కీలక పరిణామాలకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా తొలిసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకత్వం మండల పరిషత్ పీఠాన్ని అధిష్ఠించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
పాలకవర్గం ఆరంభంలో ఎంపీపీ పదవికి జరిగిన ఎన్నికలో లాటరీ ద్వారా వైకాపాకు చెందిన భోగి గౌరీ ఎంపీపీగా ఎంపికయ్యారు. అనంతరం మండల పరిషత్‌లో రాజకీయ సమీకరణాలు మారడంతో ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో భోగి గౌరీ ఎంపీపీ పదవిని కోల్పోయారు.
అనంతరం జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన యజ్జల లక్ష్మి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న ఎంపీపీ పదవి దక్కించుకోవడంతో యజ్జలక్ష్మి ఆనందం వ్యక్తం చేసింది. ఇలా లాటరీ ద్వారా వైకాపా ఎంపీపీ, అనంతరం అవిశ్వాసంతో మారిన రాజకీయ సమీకరణాలు, చివరకు టీడీపీకి చెందిన యజ్జల లక్ష్మి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడం వంటి పరిణామాలతో ప్రస్తుత మండల పరిషత్ పాలకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇక ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో మండల పరిషత్ పాలనలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష పాత్రకు తెరపడనుంది. గురువారం నుంచి ప్రభుత్వం నియమించే ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో మండల పరిషత్ పరిపాలన కొనసాగనుంది. గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ప్రారంభమైన ప్రత్యేక అధికారుల పాలనకు కొనసాగింపుగా మండల పరిషత్‌లోనూ అధికారుల పాలన మొదలుకానుంది.దీంతో బాడంగి మండల పరిషత్‌లో ప్రజాప్రతినిధుల పాలనకు నేటితో ముగింపు పలుకుతూ, రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనకు తెరలేవనుంది.