andhrapradesh
రాజమండ్రి రూ. 2 కోట్ల నగదు మాయం కేసులో కీలక మలుపు విశాఖలో డ్రైవర్ సాయిశివ అరెస్ట్.. రూ.1.61 కోట్లు రికవరీ
రాజమంహేంద్రవరం, సూర్య ప్రతినిధి : నగరంలో తీవ్ర కలకలం రేపిన రూ. 2 కోట్ల నగదు మాయం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. భారీ మొత్తంలో నగదుతో పరారైన ప్రధాన నిందితుడు, డ్రైవర్ సాయిశివను విశాఖపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖలో అరెస్ట్ చేసిన నిందితుడు సాయిశివ వద్ద నుంచి రూ. 1.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. మండపేటలో మరొక వ్యక్తి వద్ద ఉన్న రూ. 50 లక్షల నగదును గుర్తించి జప్తు చేశారు.
సాంకేతిక ఆధారాలతో పట్టివేత
ఘటన నమోదైన వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు.. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాయి. సీసీ కెమెరాల దృశ్యాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టి నిందితుడి కదలికలను పసిగట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో విశాఖలో దాక్కున్న డ్రైవర్‌ను చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ భారీ చోరీ ఘటనలో డ్రైవర్ సాయిశివకు సహకరించిన ఇతర వ్యక్తులు ఎవరు? ప్లాన్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. మిగిలిన నగదును కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.