ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు ఘనంగా సన్మానం!
మర్రిగూడ, అక్టోబర్ 10: టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మర్రిగూడ మండలం సరంపేట గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో క్షయవ్యాధి (టీబీ)పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు చేయించడంలో ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తల కృషి ఎంతో కీలకమని తెలిపారు. గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా ఎంపిక చేయడంలో కృషి చేసిన వైద్య సిబ్బందిని అభినందిస్తూ, భవిష్యత్తులోనూ గ్రామంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.