దసరా వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: దసరా పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలు, రావణ దహనం, దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ అధికారులను ఆదేశించారు. పండుగ బందోబస్తు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతపై పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా 407 దుర్గామాత విగ్రహాలు ప్రతిష్ఠించిన నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాలకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిమజ్జన మార్గాలను ముందుగానే పరిశీలించి, అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. రావణ దహన కార్యక్రమాల వద్ద జనసమూహాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ దసరా పండుగను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.