దసరా పండుగకు ముందే మున్సిపల్ కార్మికులకు జీతాలు, బట్టలు, సబ్బులు, నూనెలు ఇవ్వాలి: సీఐటీయూ
వికారాబాద్, మేజర్ న్యూస్: దసరా పండుగకు ముందే మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు పెండింగ్ జీతాలతో పాటు పండుగ బట్టలు, సబ్బులు, నూనెలు వెంటనే అందించాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పండుగకు మూడు రోజులే మిగిలి ఉన్నప్పటికీ జీతాలు అందకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు పండుగకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో వికారాబాద్ మున్సిపల్ యాజమాన్యం, చైర్మన్, కమిషనర్ వెంటనే స్పందించి కార్మికులకు జీతాలు, పండుగ కానుకలు అందించాలని కోరుతూ గాంధీ విగ్రహం ఎదుట మౌన దీక్ష నిర్వహించారు. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్. మహిపాల్తో పాటు మున్సిపల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.