బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
. ఆటపాటలతో అలరించిన మహిళలు
జిన్నారం:ఒక్కేసి పువ్వేసి.. చందమామ.. ఒక్క జాములాయే చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ మహిళల బతుకమ్మ పాటలతో బొల్లారం పట్టణం మార్మోగింది. ఆదివారం పట్టణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులు, మహిళలు డీజే బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీధివీధినా బతుకమ్మ పాటలు మార్మోగడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, యువతులు, చిన్నారులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిన్నారం రిపోర్టర్ యు .చంద్రశేఖర్