భువనగిరిలో సద్దుల బతుకమ్మ సంబరాలు
భువనగిరి:జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు. 23వ వార్డులో కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. పండుగ వాతావరణంతో వార్డులో సందడి నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.భువనగిరి పట్టణంలోని ఇతర వార్డుల్లోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.