బాధిత రైతులకు న్యాయం చేయాలి
మాజీ జెడ్పీటీసీ కోలా ఉపేందర్‌రావు
మునగాల, మేజర్ న్యూస్: మునగాల మండలం ఎస్.ఎం.పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 97లో సుమారు 40 మంది చిన్న, సన్నకారు రైతులు 10 నుంచి 20 సెంట్ల చొప్పున భూములను సాగు చేసుకుంటూ గత 30 నుంచి 40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారని మాజీ జెడ్పీటీసీ కోలా ఉపేందర్‌రావు అన్నారు.
బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులు ఆ భూముల్లో మెట్ట పంటలు సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు రైతులు వినతిపత్రం అందించాలని నిర్ణయించుకున్నారని, అయితే తమ సమస్యను చెప్పుకునే అవకాశం కూడా లేకుండా కొంతమంది రైతులను రాత్రి సమయంలో అరెస్టు చేసి నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని ఆరోపించారు. చిన్న, సన్నకారు రైతులను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమన్నారు.
ఇదేనా ప్రజా పాలన? అని కోలా ఉపేందర్‌రావు ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే వారి కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో ఇదే భూములను రైతులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల సమస్యను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి, భూములు కోల్పోతున్న బాధిత రైతులకు భూమికి భూమి లేదా తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.