ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమం
మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత నెల్లూరు సైకాలజిస్ట్స్ అసోసియేషన్
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారంనాడు నెల్లూరు మినీ టౌన్ హాల్లో మానసిక ఆరోగ్య అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైకాలజిస్ట్ కోదండరాం , మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థైర్యం, డిజిటల్ యుగంలో మానసిక ఆరోగ్యం, నివారణ–ప్రారంభ దశలో జోక్యం మరియు సహాయక వ్యవస్థలపై అవగాహన కల్పించారు. తదుపరి సైకాలజిస్ట్ డాక్టర్ జి . పద్మజ మాట్లాడుతూ... మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మానసిక ఆరోగ్యం అంటే మానసిక అనారోగ్యం లేకపోవడం మాత్రమే కాదని, భావోద్వేగాలను సమతుల్యంగా నిర్వహించడం, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడం, కుటుంబం మరియు సమాజంతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడం కూడా మానసిక ఆరోగ్యంలో భాగమని వివరించారు. మానసిక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందాలని సూచించారు. అనంతరం సైకాలజిస్ట్ ఎం . రవిచంద్ర మాట్లాడుతూ దైనందిన జీవితంలో భావోద్వేగ స్తైర్యాన్ని పెంపొందించుకోవడం ముఖ్యమన్నారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, వైఫల్యాలు మరియు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భావోద్వేగా స్తైర్యం ఎంతో అవసరమని వివరించారు. సానుకూల ఆలోచన, భావోద్వేగ నియంత్రణ, కుటుంబ సభ్యులు–స్నేహితులతో మనసును పంచుకోవడం, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందడం ద్వారా భావోద్వేగ స్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు.అనంతరం మోటివేషనల్ స్పీకర్ కె. డొమినిక్ రెడ్డి మాట్లాడుతూ , మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా మరియు అధిక ఆన్‌లైన్ వినియోగం వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. డిజిటల్ వినియోగాన్ని సమతుల్యం చేసుకోవడం, సోషల్ మీడియా పోలికలను తగ్గించడం, కుటుంబంతో సమయం గడపడం, యోగా, ధ్యానం మరియు శారీరక వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. తదుపరి లైఫ్ స్కిల్స్ కోచ్ సిహెచ్ రమేష్ బాబు మాట్లాడుతూ...మానసిక సమస్యలను తీవ్ర స్థాయికి చేరకముందే గుర్తించి ప్రారంభ దశలోనే అవసరమైన సహాయం అందించడం ముఖ్యమని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు మరియు సహోద్యోగులు సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులను తీర్పు ఇవ్వకుండా సానుభూతితో వినాలని సూచించారు. లైఫ్ స్కిల్స్ ద్వారా సమస్య పరిష్కార సామర్థ్యం, కమ్యూనికేషన్ మరియు ఒత్తిడి నిర్వహణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమానికి యోగాచార్య చంద్రశేఖర్ ప్రణవ, సైకాలజిస్ట్ & యోగా మాస్టర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రణవ యోగా & వెల్నెస్ సభ్యులు, యోగా మిత్ర మండలి సభ్యులు, లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సభ్యులు పాల్గొన్నారు.అలాగే నెల్లూరు సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు రమణయ్య, పాణిరాజ్ కుమార్ తదితర సైకాలజిస్టులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.