అంతర్ జిల్లాల ట్రాన్స్‌ఫార్మర్ ల దొంగతనాల నిందితుడి అరెస్ట్ - డీఎస్పీ మధుసూదన్
సూర్య- బిక్కనూర్ : అంతర్ జిల్లాల ట్రాన్స్‌ఫార్మర్ ల దొంగతనాల నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డి.ఎస్.పి మధుసూదన్ చెప్పారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ గత కొంతకాలంగా ట్రాన్స్‌ఫార్మర్ ల దొంగతనాల ప్రధాన నిందితుడిగా ఉన్న జిల్లాలోని బిచ్కుంద గ్రామానికి చెందిన టాక్ షంషీర్ సింగ్ తప్పించుకుని తిరుగుతుండగా, శనివారం మండలంలోని రామేశ్వర్ పల్లి శివారులో మరోసారి దొంగతనానికి రెక్కీ నిర్వహించగా, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డి.ఎస్.పి చెప్పారు. గతంలో మరో ముగ్గురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడైన షంషీర్ సింగ్ ను పట్టుకొని అతని వద్ద బైక్ తోపాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడు 54 ట్రాన్స్‌ఫార్మర్ ల చోరీ కేసులో ప్రమేయం ఉన్నట్లు, నిందితుడిపై పలు జిల్లాలలో కేసులు ఉన్నట్లు, నిందితుడిని పట్టుకున్న సీఐ సంపత్ కుమార్, ఎస్సై అనిల్, సిబ్బంది బాలకృష్ణ, శ్రీకాంత్, కిషన్ గౌడ్, శేఖర్ లను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించినట్లు డీఎస్పీ చెప్పారు.