111 క్వారీపై అధికారుల నివేదికలోనే కొత్త ప్రశ్నలు
క్రషింగ్ మొదలు కాలేదంటూ.. అప్రోచ్ రోడ్డు ఎలా అభివృద్ధి?
రావల్‌కోల్ సర్వే నంబర్ 111పై రెవెన్యూ నివేదికలో వైరుధ్యాలు
మేడ్చల్, మేజర్ న్యూస్, (అక్టోబర్ 4): రావల్‌కోల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 111లో ప్రతిపాదిత క్వారీ లీజు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. క్వారీ కార్యకలాపాలపై రెవెన్యూ అధికారులు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించిన నివేదికలో పేర్కొన్న అంశాలే ప్రస్తుతం పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి.రెవెన్యూ నివేదిక ప్రకారం సర్వే నంబర్ 111లో 25 ఎకరాల 03 గుంటల విస్తీర్ణంలో క్వారీ లీజు మంజూరు కోసం అప్పటి మేడ్చల్ తహసీల్దార్ ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించి 22-02-2019న జారీ చేసిన లేఖను కూడా నివేదికలో ప్రస్తావించారు.అయితే క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో క్వారీ యజమాని ఎలాంటి క్రషింగ్ కార్యకలాపాలు ప్రారంభించలేదని, క్వారీయింగ్ కూడా మొదలు కాలేదని అధికారులు నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో క్వారీ కార్యకలాపాలు ప్రారంభం కాలేదని అధికారులే చెబుతున్నప్పుడు.. లీజు ప్రాంతం చుట్టూ బౌండరీ పిల్లర్లు ఎలా ఏర్పాటు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అదేవిధంగా క్వారీకి వెళ్లే అప్రోచ్ రోడ్డు అభివృద్ధి జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుండగా, ఈ రహదారి అభివృద్ధికి ఎవరి అనుమతులు ఉన్నాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. క్వారీయింగ్ ప్రారంభం కాలేదని పేర్కొంటున్న అధికారుల నివేదికలోనే అప్రోచ్ రోడ్డు, బౌండరీ పిల్లర్ల అంశాలపై స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ వ్యవహారంపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించి, సర్వే నంబర్ 111లో ప్రస్తుతం జరుగుతున్న పనులకు అనుమతులు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టర్ తలారి శివకుమార్.