ఇంగ్లండ్‌పై శ్రీలంక చారిత్రాత్మక విజయం.. 430 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనతో సంచలనం
సూర్య స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా రావాల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో శ్రీలంక అద్భుత ఘనత సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 430 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక చివరి బంతికి ఛేదించి ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ కాగా, శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు ఛేజింగ్‌గా రికార్డు పుటలకెక్కింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు అసాధారణ పోరాట పటిమ కనబరిచి తమ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.
భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓపెనర్ కమిందు మెండిస్ 18 పరుగులకే నిష్క్రమించగా, కెప్టెన్ కుశాల్ మెండిస్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్లిష్ట సమయంలో మరో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో 97 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, యువ ఆటగాడు పవన్ రత్నాయకే 106 బంతుల్లో 130 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అవిష్కా నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ దాసున్ షనకా కేవలం 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
ముగింపు దశలో పవన్ రత్నాయకే, షనకా అవుటయ్యాక జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను జనిత్ లియానగే తీసుకున్నాడు. ఆయన 27 బంతుల్లో 61 పరుగులు చేసి ఆఖరి వరకు పోరాడాడు. జోష్ టంగ్ వేసిన చివరి ఓవర్‌లో శ్రీలంక విజయనకి 8 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి సింగిల్ లభించింది. ఆ తదుపరి రెండు బంతుల్లో శ్రీలంక వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఇంగ్లండ్ వైపు మళ్లేలా కనిపించింది. అయితే క్రీజులోకి వచ్చిన అషితా ఫెర్నాండో సింగిల్ తీసి ఇవ్వగా, ఆఖరి రెండు బంతుల్లో 6 పరుగులు కావాల్సిన సమయంలో లియానగే భారీ సిక్సర్ బాది శ్రీలంకకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల కొండంత స్కోరు సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఆయన 116 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 202 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు విల్ జాక్స్ 66 పరుగులు, జో రూట్ 69 పరుగులు, టామ్ బాంటన్ 50 పరుగులతో అర్ధశతకాలు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించారు. అయితే శ్రీలంక బ్యాటర్ల అద్భుత పోరాటం ముందు బ్రూక్ సాధించిన ద్విశతకం వృథా అయిపోయింది.
Also Read: ఫ్రెంచ్ ఓపెన్‌లో తంటాలు పడిన పీవీ సింధు.. తొలి రౌండ్లోనే కిడాంబి శ్రీకాంత్ అవుట్