BREAKING
ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ అప్‌డేట్, శ్రీలంకలో భారీ యాక్షన్ షెడ్యూల్ జాహ్నవి రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం 108 అంబులెన్సులో సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ నుంచి రోహిత్ నాయుడు ఎలిమినేట్, షాకింగ్ నిర్ణయంతో కలకలం గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తి చేయాలి - దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశం యాంకరింగ్‌ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమ, తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు రామాయణంలో సీత పాత్రపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ విశేషాలు ఇవే ఓ మై డాగ్ సినిమా రివ్యూ, పంకజ్ త్రిపాఠి నటించిన ఈ చిత్ర విశేషాలు ఇవే బంగారం ప్రియులకు భారీ ఊరట, దిగొచ్చిన పసిడి ధరలు, నవంబర్ 1 తాజా రేట్లు ఇవే ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి

ఇదో జడభరతుని 'వ్యధ '.. *నేటి తరానికి కనువిప్పు కలిగించే గాథ ..

Select Suryaa Now
ఇదో జడభరతుని 'వ్యధ '.. *నేటి తరానికి కనువిప్పు కలిగించే గాథ ..

సువిశాల భారతావనిని ఏలిన చక్రవర్తుల్లో ఋషభదేవుని జ్యేష్ఠపుత్రుడైన భరతుడు సుప్రసిద్ధుడు. ఆయన పేరుమీదుగానే అప్పటివరకు 'అజనాభఖండం' గా పిలువబడిన ఈ భూభాగం 'భరతవర్షం' గా ప్రసిద్ధి చెందింది. అటువంటి భరతుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన శ్రీమద్భాగవత పురాణం, పంచమస్కంధం లోని అత్యంత లోతుగా ఆలోచింపజేసే ఉపాఖ్యానాల్లో ఒకటి.

తండ్రి ద్వారా సంక్రమించిన సామ్రాజ్యాన్ని పరమభాగవతోత్తముడైన భరతుడు సుదీర్ఘకాలం సుభిక్షంగా పాలించాడు. అనంతరం రాజ్యాన్ని తన ఐదుగురు కుమారులకు ధర్మబద్ధంగా పంచి, రాజప్రాసాదాన్ని విడిచి పులహాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ప్రవహించే గండకీ నదీతీరంలోని ఏకాంత ప్రదేశంలో శ్రీహరిని ఆరాధిస్తూ ప్రశాంత జీవితం గడపసాగాడు. 

ఒకరోజు యథాప్రకారం భరతుడు నదిలో స్నానసంధ్యాదులు ముగించుకుంటున్న సమయంలో, నిండు గర్భవతిగా ఉన్న ఒక జింక దప్పిక తీర్చుకోవడం కోసం నదీతీరానికి వచ్చింది. అంతలో భీకరమైన సింహగర్జన వినిపించడంతో, ప్రాణభయంతో ఆ జింక ఒకే గంతులో నదికి అవతలి ఒడ్డుకు చేరుకునేందుకు ప్రయత్నించింది. ఆ తత్తరపాటులో దాని గర్భంలోని జింకపిల్ల జారి నదిలో పడిపోయింది. తల్లి జింక లోయలో పడి మరణించగా, దాని పిల్ల మాత్రం నిస్సహాయంగా ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. ఆ జింకపిల్లను చూసిన భరతుడి హృదయం ద్రవించిపోయింది. అనాథగా మిగిలిన ఆ మూగజీవిని ఆశ్రమానికి తీసుకొచ్చి ఆత్మీయంగా సంరక్షించడం ప్రారంభించాడు.

జింకపిల్ల పట్ల భరతుడి మదిలో ఏర్పడిన మానవ సహజమైన కారుణ్యభావన, క్రమేణా బాధ్యతగా మారింది. తరువాత అదే మమకారంగా పరిణమించింది. జింకపిల్ల అడవిలోకి వెళ్లినా, ఆలస్యంగా తిరిగివచ్చినా అతని మనసు కలవరపడేది. ధ్యానం చేస్తున్నప్పటికీ అతని ఆలోచనలన్నీ ఆ పసిప్రాణం చుట్టూనే పరిభ్రమించేవి. తపస్సు చేస్తున్నప్పుడు కూడా మనసు దాని క్షేమం గురించే విలవిల్లాడిపోయేది. కాలం గడిచినకొద్దీ ఆ జింకపిల్లను సంరక్షించడమే తన జీవితధ్యేయమన్నంతగా,  అతని నిత్యకృత్యాలు దానితో పెనవేసుకుపోయాయి. వ్యామోహం పెరుగుతుండటంతో, దానితోనే కాలం గడుపుతూ తన అనుష్ఠానాలను క్రమంగా నిర్లక్ష్యం చేశాడు. నిత్యనైమిత్తిక కర్మలన్నింటికీ ఒక్కొక్కటిగా తిలోదకాలు వదిలాడు. ఇలా సర్వసంగపరిత్యాగిగా అప్పటివరకూ సాగిన భరతుడి వానప్రస్థాశ్రమం, జింకపిల్ల కారణంగా ఒక పసిగుడ్డు కోసం తపించే ఇల్లాలి దినచర్యలా మారిపోయింది. 

తుదిశ్వాస వరకూ జింకపిల్లనే తలపుల్లో నింపుకున్న భరతుడు, సహజంగానే మరుజన్మలో జింకగా జన్మించాడు. మూడవ జన్మలో జడభరతుడిగా అవతరించిన అతడు, తన పూర్వజన్మల జ్ఞాపకాలతో గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాలని సంకల్పించాడు. అన్ని రకాల బంధాలకు ఉద్దేశపూర్వకంగా దూరంగా, జడప్రాయంగా జీవించాడు. విపత్కర పరిస్థితుల్లోనూ స్థిరచిత్తంతో నిలిచిన జడభరతుడు, ప్రాణాలను రక్షించుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అలా మమకారాలకు అతీతంగా నిరంతర సాధన చేసి చివరకు మోక్షాన్ని పొందాడు.

అయితే, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం దృష్టితో పరిశీలిస్తే ఈ ఉపాఖ్యానంలోని మరో కోణం మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. నేడు ఇదే మానసిక ప్రక్రియ మన నిత్యజీవితంలో ఎన్నో సందర్భాల్లో పునరావృతమవుతుంది. ఉదాహరణకు, ఒక అత్యవసర అధికారిక సందేశం పంపాలనే ఉద్దేశంతో వాట్సాప్ తెరుస్తాం. అదే సమయంలో మరో చాట్‌లో కొత్త నోటిఫికేషన్, లేదా ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్‌తో కూడిన యూట్యూబ్ వీడియో కనిపిస్తుంది. మనం మొదట అత్యవసరంగా భావించిన పనిని 'కొద్దిసేపు' వాయిదా వేసి,  ఆ సంభాషణ లేదా వీడియోను తెరుస్తాం. ఆ చర్చ లేదా విషయంపై ఆసక్తి పెరుగుతుంది. తెలియకుండానే వాదోపవాదాల్లో పాల్గొంటాం లేదా వీడియోను ఆస్వాదిస్తాం. గంటలకొద్దీ సమయం క్షణాల్లా గడిచిపోతుంది. చివరకు వాట్సాప్ ఎందుకు తెరిచామో మరిచిపోతాం. పంపాల్సిన ఆ అత్యవసర సందేశం అటకెక్కిపోతుంది.

సాధారణంగా మనిషి తన లక్ష్యాన్ని ఒక్కసారిగా కోల్పోడు. చాలాసార్లు 'కొద్దిసేపు' వాయిదా వేసిన నిర్ణయమే నెమ్మదిగా జీవిత దిశను మార్చేస్తుంది. ఇక్కడ మారింది మన లక్ష్యం కాదు; 'దృష్టి' మాత్రమే. భరతుడి జీవితంలో ఆ పాత్రను పోషించింది ఒక అమాయకమైన జింకపిల్ల. నేడు అదే పాత్రను ఒక నోటిఫికేషన్, ఒక వైరల్ చర్చ, ఒక ప్రకటన, ఒక కొత్త డిజిటల్ ఆకర్షణ, ఒక అత్యాశ లేదా ఒక వ్యసనం పోషించవచ్చు.

ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఈ మానసిక ప్రక్రియను 'అటెన్షనల్ క్యాప్చర్' అనే భావన ద్వారా వివరిస్తారు. మన దృష్టిని ఆకర్షించిన ఒక అంశం, అసలు లక్ష్యంపై నుంచి మన ఏకాగ్రతను మళ్లించే ప్రక్రియ ఇది. వ్యాపార, ఉత్పాదకత సాహిత్యంలో ఇదే ధోరణిని 'షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్' అని కూడా వ్యవహరిస్తున్నారు. అంటే, మన అవసరం లేదా లక్ష్యంతో సంబంధం లేకపోయినా, కొత్తదనం లేదా ఆకర్షణ కారణంగా ఏదో ఒక విషయం మన దృష్టిని బలంగా ఆకర్షించి, అసలు లక్ష్యం నుంచి మనల్ని మెల్లగా, చాలాసార్లు శాశ్వతంగానే, దూరం చేయడం.

వాస్తవానికి కొత్తదనం వైపు ఆకర్షించబడటం మనిషి సహజ స్వభావం. ఆదిమానవుడి కాలంలో అడవిలో వినిపించిన ప్రతి కొత్త శబ్దం, కనిపించిన ప్రతి కొత్త కదలిక వెనుక ప్రమాదమో, ఆహారమో దాగి ఉండే అవకాశం ఉండేది. ఆ నేపథ్యంలో సాధారణ స్థితికి భిన్నంగా ఉన్న ఏ పరిణామాన్నైనా వెంటనే గమనించడం, మనిషి మనుగడకు అనివార్యమైన సహజసిద్ధ లక్షణంగా రూపుదిద్దుకుంది. నాగరికత పెరిగినకొద్దీ ఆ స్వభావం తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. అయితే, మనిషి అప్రయత్నంగానే స్పందించే ఆ మానసిక ధోరణిని ఇటీవలి కాలంలో ఆధునిక ప్రపంచం అత్యంత చాకచక్యంగా వినియోగించుకుంటోంది.

భరతుడి కాలంలో ఒక జింకపిల్ల అతని దృష్టిని యథాలాపంగా మళ్లించింది. నేడు ఆ పని యాదృచ్ఛికంగా జరగడం లేదు. మానవ 'దృష్టి' విలువను గుర్తించిన వ్యాపార ప్రపంచం దానినే ఒక వాణిజ్య వనరుగా మార్చుకుంది. అందుకే ఆర్థిక శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ విశ్లేషకులు ఈ పరిణామాన్ని 'అటెన్షన్ ఎకానమీ' - అంటే 'దృష్టిని ఆకర్షించే అర్థవ్యవస్థ' - గా అభివర్ణిస్తున్నారు. ఒకప్పుడు భూమి, గనులు, అడవులు, నీటి వనరులు వంటి సహజ సంపదల కోసం దేశాలు, సంస్థలు పోటీ పడేవి. తరువాత స్పెక్ట్రమ్, డేటా వంటి కృత్రిమ వనరుల ప్రాధాన్యం పెరిగింది. నేడు వాటన్నింటినీ మించి వినియోగదారుడి 'దృష్టి' అత్యంత విలువైన వాణిజ్య వనరుగా ఆవిర్భవించింది. విస్తృతంగా వృద్ధి చెందిన ఈనాటి వాణిజ్య వ్యవస్థలో ప్రతి మనిషీ వినియోగదారుడే.

భరతుడి కథ కూడా ఇదే విషయాన్ని మరో విధంగా గుర్తు చేస్తుంది. జింకపిల్లను రక్షించడం ఆక్షేపణీయం కాదు. కరుణ, మమకారం, బాధ్యత - ఇవన్నీ మానవుడు అలవరచుకోవలసిన గుణాలే. అయితే అవి జీవితపు ప్రధాన ధ్యేయాన్ని మసకబార్చేంతగా పెరిగినప్పుడే సమస్య ప్రారంభమవుతుంది. అందుచేతనే భరతుడు మోక్షసాధన కోసం మరో రెండు జన్మలు వేచి చూడాల్సి వచ్చింది.

ఈ ఉపాఖ్యానం జీవితంలో ఏది ప్రధానమో, ఏది ఉపప్రాధాన్యమో, ఏది అప్రధానమో గుర్తించే విచక్షణను కోల్పోకూడదని హెచ్చరిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాన్ని దారి మళ్లించేది పెద్ద ప్రమాదాలు కావు; అనాలోచితంగా మన దృష్టిని ఆకర్షించిన, లేదా ఉద్దేశపూర్వకంగా మన దృష్టిని ఆకర్షించేలా రూపొందించబడిన, చిన్నా-పెద్దా విషయాలే.

అందుకే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు, లక్ష్యం నుంచి దృష్టి మరలకుండా చూసుకోవాలి. దృష్టి నిలకడగా ఉన్నప్పుడే సమయం సార్థకమవుతుంది. జడభరతుని ఉపాఖ్యానం మనకు ఈ వాస్తవాన్ని స్ఫురింపజేస్తుంది.

కృష్ణబాలాజి పల్లపోతు:99490 98406