ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో భారీ ట్రాక్టర్ తయారీ యూనిట్
సూర్య బిజినెస్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమవుతున్న తరుణంలో మరో భారీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోంది. యమునా ఎక్స్‌ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) పరిధిలోని జేవార్ ప్రాంతంలో అత్యాధునిక హంగులతో కూడిన కొత్త ట్రాక్టర్ తయారీ కర్మాగారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ప్రఖ్యాత సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్ సంస్థ ఆధ్వర్యంలో రూ. 1,200 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా సుమారు 1,200 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండటం విశేషం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. పెట్టుబడులకు జేవార్ ప్రాంతం దేశంలోనే అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరియు సులభతర వ్యాపార విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వలనే అంతర్జాతీయ స్థాయి కంపెనీలు యూపీ వైపు తరలివస్తున్నాయని తెలిపారు. గత తొమ్మిన్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి రూ. 50 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, తద్వారా దేశంలోని అగ్రగామి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉత్తరప్రదేశ్ అవతరించిందని పేర్కొన్నారు. కేవలం సాంప్రదాయ రంగాలు మాత్రమే కాకుండా సెమీకండక్టర్లు, ఐటీ, రోబోటిక్స్, ఏగ్రిటెక్ వంటి అత్యాధునిక రంగాలలోనూ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
భారతదేశ ట్రాక్టర్ మార్కెట్లో ఒక్క ఉత్తరప్రదేశ్ వాటాయే సుమారు 18.5 శాతంగా ఉందని, సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఈ నూతన ప్లాంట్ రాష్ట్రంలోని వ్యవసాయ యంత్రాల తయారీ రంగానికి సరికొత్త ఊపునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జేవార్ ప్రాంతంలో ఇప్పటికే ప్రతిపాదిత మెడికల్ డివైస్ పార్క్, టాయ్ పార్క్, ఎంఎస్‌ఎంఈ పార్క్ మరియు డేటా సెంటర్ ప్రాజెక్టులతో పాటు ఈ ట్రాక్టర్ తయారీ యూనిట్ కూడా తోడవడంతో పశ్చిమ యూపీ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది. ఈ భారీ పెట్టుబడులు కేవలం ఉపాధి కల్పనను పెంచడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థను మరియు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.