ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
సూర్య జాతీయ డెస్క్: భారత రాజధాని నదీగర్భ ప్రాంతంలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తీవ్రమైన పొగమంచు (స్మగ్) నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో, ఢిల్లీ మరో అవాంఛనీయ రికార్డును మూటగట్టుకుంది. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంతో పోలిస్తే ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారి, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఇది తొలి స్థానానికి చేరింది. దాదాపు రెండు కోట్ల జనాభా కలిగిన ఈ మహానగరాన్ని దట్టమైన విషపూరిత పొగమంచు కమ్మేయడంతో దృశ్యత (విజిబిలిటీ) భారీగా పడిపోయింది. శీతాకాలం ప్రారంభంలోనే ఉత్తరాది రాష్ట్రాలలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడం పట్ల పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏటా శీతాకాలం రాగానే చల్లని, బరువైన గాలి వాతావరణంలో పేరుకుపోవడం వల్ల వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, నిర్మాణ రంగాల నుంచి వచ్చే ధూళి మరియు పంట వ్యర్థాల దహనం (స్టబుల్ బర్నింగ్) వంటి కాలుష్యకారకాలు గాలిలోనే నిలిచిపోతుంటాయి. దీనికి తోడు నగరంలో పెరిగిన రవాణా రద్దీ పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక యంత్రాంగాలు ఇప్పటికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) నిబంధనలను అమలులోకి తెచ్చాయి. పాఠశాలలకు ఆన్‌లైన్ తరహా విద్యా విధానాన్ని అమలు చేయాలని, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.