తమిళనాడు సీఎంను కలిసిన ఇస్రో చైర్మన్ నారాయణన్
సూర్య బ్యూరో, చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ చెన్నైలోని రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సచివాలయానికి చేరుకున్న ఇస్రో అధినేతకు అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇరువురు పరస్పరం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ మర్యాదపూర్వక సమావేశంలో అంతరిక్ష పరిశోధనారంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతితో పాటు తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రంలో అంతరిక్ష రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు, పరిశోధనా కార్యకలాపాల విస్తరణ తదితర సాధారణ అంశాలపై క్లుప్తంగా చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ ముగిసిన అనంతరం ఇస్రో చైర్మన్ సచివాలయం నుంచి తిరుగుపయనమయ్యారు. ఉన్నత శాస్త్రవేత్త, రాష్ట్ర పరిపాలనాధినేత మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.