ఒకే వేదికపై ఫడ్నవీస్, ఉద్ధవ్, రాజ్ ఠాక్రే: ముంబైలో అరుదైన రాజకీయ దృశ్యం
సూర్య నేషనల్ బ్యూరో, ముంబై:మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వైరం ఉన్న ముగ్గురు అగ్ర నాయకులు ఒకే వేదికను పంచుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ ఠాక్రే దాదర్‌లోని వీర్ సావర్కర్ స్మారక్ ఆడిటోరియంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. ప్రముఖ సీనియర్ కార్టూనిస్ట్ ప్రశాంత్ కులకర్ణి సంపాదకత్వంలో వెలువడిన ‘మహారాష్ట్రాచి హాస్యరేఖ’ అనే పుస్తక విడుదల వేడుక వీరి అరుదైన కలయికకు వేదికైంది.
పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకునే నేతలంతా రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడమే కాకుండా చమత్కారాలు, పంచ్‌లతో వేదికపై నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన నేతలు ఒకే కార్యక్రమంలో కలిసి కూర్చోవడం, నవ్వుకోవడం మహారాష్ట్ర సంస్కృతి అని వ్యాఖ్యానించారు. “2019 వరకు ఉద్ధవ్ జీ ఎప్పుడు పిలిచినా నేను వెళ్లేవాడిని, కానీ 2019 తర్వాత ఆయన నన్ను పిలవనే లేదు.. నేను ఇప్పటికీ పిలుపు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను” అంటూ ఫడ్నవీస్ వేసిన చమత్కారానికి సభ ప్రాంగణం నవ్వులతో మార్మోగింది. రాజ్ ఠాక్రే వేసే వ్యంగ్య చిత్రాల గురించి ప్రస్తావిస్తూ, నా కార్టూన్ వేస్తే ముక్కు, చెవులు పెద్దవిగా చూపించండి కానీ పొట్టను మాత్రం పెద్దదిగా చూపించవద్దని తాను కోరినట్లు సరదాగా చెప్పారు.
మరోవైపు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ, కళ, సంస్కృతికి సంబంధించిన వేదికలపై రాజకీయాలను పక్కనబెట్టి అంతా ఏకం కావడం చాలా సహజమని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ముంబై నగరంలో కార్టూనిస్టుల కళాఖండాల కోసం అంతర్జాతీయ స్థాయి ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం ఠాక్రే సోదరుల సహకారం కూడా తీసుకుంటామని సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. కాగా, వేదికపైకి రాకముందు గదిలో ముగ్గురు నేతలు సమావేశమయ్యారన్న ప్రచారాన్ని సీఎం ఖండిస్తూ, కేవలం వెయిటింగ్ రూమ్‌లో సాధారణంగా కూర్చున్నామని స్పష్టం చేశారు.