పోలాండ్ ట్రిబ్యునల్ చీఫ్ సస్పెన్షన్: కోర్టు ప్రాంగణంలో పోలీసుల భారీ మోహరింపు
సూర్య ఇంటర్నేషనల్ బ్యూరో, వార్సా:పోలాండ్‌లో అధికార సెంట్రిస్ట్ కూటమి ప్రభుత్వం మరియు మితవాద ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన కాన్‌స్టిట్యూషనల్ ట్రిబ్యునల్ చీఫ్ జస్టిస్ బొగ్దాన్ స్వియెచ్‌కోవ్స్కీ తో పాటు వైస్ ప్రెసిడెంట్‌పై సస్పెన్షన్ వేటు పడటంతో రాజధాని వార్సాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ప్రాంగణం వద్ద తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో భారీ సంఖ్యలో అల్లర్ల నిరోధక పోలీసులను మోహరించారు.
ముఖ్య న్యాయమూర్తి తొలగింపును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష లా అండ్ జస్టిస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కోర్టు వెలుపల భారీ నిరసనలకు దిగారు. ప్రధాని డొనాల్డ్ టస్క్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ భద్రతా బారికేడ్లను దాటి లోపలికి చొచ్చుకెళ్లేందుకు కొందరు ఆందోళనకారులు యత్నించగా, పోలీసులపైకి వస్తువులు విసిరిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కోర్టు అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ఈ పరిణామాలను ‘ప్రజాస్వామ్య తిరుగుబాటు’ గా అభివర్ణించగా, న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికే ఈ కఠిన నిర్ణయాలు అనివార్యమయ్యాయని ప్రధాని టస్క్ సమర్థించుకున్నారు.
ఈ సంక్షోభం ముదరడంతో సెనెగల్ వెళ్తున్న పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకి తన విమానాన్ని గాల్లోనే వెనక్కి తిప్పించి ఆఫ్రికా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. దేశంలో అత్యంత క్లిష్ట సమయం నడుస్తున్నందున తాను స్వదేశంలోనే ఉండాల్సిన అవసరం ఉందని ఆయన ప్రకటించారు. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యత్నించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి, ప్రతిపక్ష మద్దతుదారులకు మధ్య రాజుకున్న ఈ న్యాయపోరాటం పోలాండ్‌లో తీవ్ర రాజకీయ అనిశ్చితికి దారితీస్తోంది.