హాలోవీన్ వేళ జర్మనీ, ఫ్రాన్స్‌లలో నిరసనల అలర్ట్: రోడ్లపైకి వేలాది మంది యువత
సూర్య ఇంటర్నేషనల్ బ్యూరో, బెర్లిన్/పారిస్: ఐరోపాలో నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్య మరియు సామాజిక రంగాలపై బడ్జెట్ కోతలు, ప్రభుత్వ పొదుపు విధానాలకు వ్యతిరేకంగా యువత రోడ్లపైకి వస్తోంది. హాలోవీన్ వీకెండ్‌ను పురస్కరించుకుని జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించేందుకు విద్యార్థి సంఘాలు, యువజన ఉద్యమకారులు పిలుపునిచ్చారు. పండుగ వాతావరణం మాటున అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఇరు దేశాల పోలీసులు, భద్రతా విభాగాలు హై అలర్ట్ ప్రకటించాయి.
జర్మనీవ్యాప్తంగా బెర్లిన్, హాంబర్గ్, మ్యూనిచ్, హనోవర్ సహా దాదాపు 30కి పైగా ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలకు సన్నాహాలు జరిగాయి. ప్రభుత్వాలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల బడ్జెట్‌ను తగ్గించి మిలిటరీ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తును విస్మరిస్తున్నారని జర్మన్ ‘జెన్-జీ’ (Gen Z) యువత ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికలైన టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా పెద్ద ఎత్తున సమీకరణ జరుగుతుండటంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాను ముమ్మరం చేశారు.
మరోవైపు ఫ్రాన్స్‌లోనూ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘నైట్ ఆఫ్ డార్క్‌నెస్’ పేరుతో హాలోవీన్ వేడుకల ముసుగులో నగర కేంద్రాల్లోకి గుమిగూడేందుకు పిలుపులు రావడంతో ఫ్రెంచ్ హోంశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పట్టణ హింస, తోపులాటలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. పారిస్ సహా ప్రధాన నగరాల్లో వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.