వాషింగ్టన్ డీసీ గోల్ఫ్ కోర్స్ వివాదం.. ట్రంప్ ప్రభుత్వ న్యాయవాదులపై ఎథిక్స్ విచారణకు ఆదేశించిన యూఎస్ ఫెడరల్ జడ్జి!
సూర్య ఇంటర్నేషనల్ బ్యూరో, వాషింగ్టన్:*అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని చారిత్రక 'ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్' ఆధునీకరణ వివాదంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం మరియు న్యాయశాఖ (DOJ) న్యాయవాదులకు ఫెడరల్ న్యాయస్థానంలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన వివరాల్లో వాస్తవాలను దాచిపెట్టారా, తప్పుదారి పట్టించేలా వ్యవహరించి న్యాయవాద నైతిక ప్రవర్తనా నియమావళిని (Ethics Rules) ఉల్లంఘించారా అన్న అంశంపై అధికారిక దర్యాప్తునకు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అనా రేయెస్ ఆదేశాలు జారీ చేశారు.
వందేళ్ల చరిత్ర కలిగిన ఈస్ట్ పొటోమాక్ పబ్లిక్ గోల్ఫ్ కోర్స్‌ను ప్రైవేట్ భాగస్వామ్యంతో పునర్నిర్మించేందుకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన పనులపై స్థానిక పౌర సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రాజెక్టు కాంట్రాక్టులు, చెట్ల తొలగింపు మరియు క్షేత్రస్థాయి పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా చేసిన ప్రకటనలకు, న్యాయశాఖ తరఫు న్యాయవాదులు కోర్టులో తెలిపిన అంశాలకు మధ్య పొంతన లేకపోవడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. "ఇన్నాళ్లూ ఈ న్యాయస్థానం మీ మాటలను గుడ్డిగా నమ్మింది కానీ వాస్తవాలను నిర్ధారించుకోలేదు.. ఇకపై అలా జరగదు" అని వ్యాఖ్యానించిన జడ్జి, కేసుకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లను భద్రపరచాలని ఆదేశించారు.
న్యాయశాఖలో ఉన్నత స్థాయి అధికారులు హాజరైన ఈ విచారణ సందర్భంగా కోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ప్రాజెక్ట్ వ్యవహారంలో న్యాయవాదులు దురుద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు ఇచ్చారా అనే కోణంలో ఈ విచారణ సాగనుండటం అమెరికా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.